
చిలకలూరిపేట రూరల్ పరిధిలో గంజాయి విక్రయదారుడికి గట్టి షాక్…
చిలకలూరిపేట :- రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతోంది. జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సుబ్బానాయుడు గంజాయి రవాణాకు పాల్పడుతున్న పాత నేరస్థులపై నిఘా తీవ్రం చేశారు.రెండు అంతకంటే ఎక్కువ గంజాయి కేసులు నమోదై, సమాజానికి ముప్పుగా మారిన ముఠా సభ్యుల వివరాలను సేకరించి ప్రభుత్వం కు ప్రత్యేక నివేదికలు పంపే ప్రక్రియను వేగవంతం చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు నిందితుడు…
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో (Cr.No.53/2025), గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో (Cr.No.423/2023) గంజాయి అక్రమ రవాణా కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న చల్లా గోపిపై పోలీసులు ప్రత్యేక నివేదికను సిద్ధం చేశారు. చిలకలూరిపేట రూరల్ సీఐ శ్రీ బి. సుబ్బా నాయుడు పంపిన ఈ నేర చరిత్ర నివేదికను జిల్లా ఎస్పీ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాల అక్రమ రవాణా నివారణ చట్టం – 1988 ప్రకారం నిందితుడిపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ ప్రిజన్ నందు డిటెన్షన్‌లో (నిర్భంధంలో) ఉంచాలని డిటెన్షన్ ఆర్డర్ జారీ చేసింది.ఈ ఆర్డర్ ప్రకారం నిన్న చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బా నాయుడు, రూరల్ ఎస్ఐ శ్రీ జి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని ఆధీనంలోకి తీసుకుని సెంట్రల్ జైలుకు తరలించారు.
ముద్దాయి వివరాలు:
పేరు: చల్లా గోపి, S/o కోటేశ్వర రావు (లేటు), 23 సంవత్సరాలు, చిరునామా: డోర్ నెం. 2/19 లైన్, బ్రాడీపేట, గుంటూరు టౌన్, గుంటూరు జిల్లా.
పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినందనలు…
గంజాయి అక్రమ రవాణాదారులపై ప్రత్యేక నిఘా పెట్టి, పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసి, ‘ పి ఐ టి ఎన్ డి పి ఎస్’ చట్టం కింద కఠిన చర్యలు తీసుకున్న చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సుబ్బా నాయుడు, రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ ను జిల్లా ఎస్పీ శ్రీ బి. కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో గంజాయి విక్రయించినా,రవాణా చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.గంజాయి, మాదకద్రవ్యాల విక్రేతలపై కఠిన చర్యలుమాదకద్రవ్యాల రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలి
రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు.గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి,ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు లేదా వాటిని సేవించే వారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు హెచ్చరించారు. యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…గంజాయి రవాణా చేసినా,విక్రయించినా,లేదా గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచినా అటువంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.కేవలం విక్రయించే వారే కాకుండా,గంజాయి సేవించే వారిని సైతం ఉపేక్షించేది లేదని, వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.
ప్రత్యేక నిఘా – ముమ్మర తనిఖీలు
అనుమానాస్పద ప్రాంతాలు, శివారు ప్రాంతాలు,పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్లుల పరిసరాల్లో ప్రత్యేక పోలీసు బృందాలతో ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.యువత ఇటువంటి వ్యసనాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆశలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు కూడా నిరంతరం నిఘా ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిస్తే,లేదా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సుబ్బానాయుడు ప్రజలను కోరారు.సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని,చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పరిధిని మాదకద్రవ్యాల రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పాత్రికేయుల సమావేశంలో రూరల్ ఎస్సై జి అనిల్ కుమార్,కే లేఖ ప్రియాంక,స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

