
తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా ప్రభుత్వ చర్యలు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.
జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన.
అధికారులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం..
రంగారెడ్డి :- అంతర్జాతీయ ప్రమాణాలతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ లోని సర్వే నెంబర్ 167లో పండ్ల మార్కెట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలోనే అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగిందని, అదే తరహాలో సకల హంగులతో పండ్ల మార్కెట్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఇదే ప్రాంతంలో సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మించనున్నట్లు చెప్పారు. జూన్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పండ్ల మార్కెట్, సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం మార్కెట్ నిర్మించతలపెట్టిన ప్రాంతంలో అధికారయంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలైంది.సీఎం పర్యటన,మార్కెట్,రిజిస్ట్రేషన్ కార్యాలయ శంకుస్థాపన ఏర్పాట్లను ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ సి నారాయణరెడ్డి, మల్కాజ్ గిరి సీపీ సుమతి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దిశానిర్దేశం చేసి, భద్రత చర్యలపై సీపీతో చర్చించారు. సీఎం పర్యటన, పనుల ప్రారంభోత్సవం గురించి కలెక్టర్ తో చర్చించారు. గడ్డి అన్నారం నుంచి తరలించి, ప్రస్తుతం బాటసింగారంలో కొనసాగుతున్న మార్కెట్ ను ముఖ్యమంత్రి సూచనల మేరకు అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేలా నిర్ణయం జరిగిందని చెప్పారు. ఈ మేరకు కోహెడలోని ప్రభుత్వ భూములను గుర్తించి, మార్కెటింగ్ శాఖకు అప్పగించినట్లు చెప్పారు. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తైతే అటు పండ్ల విక్రయదారులు, వ్యాపారులు, వినియోగదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. మధ్యదళారీల బెడద లేకుండా ప్రజలే నేరుగా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు జరుగుతాయన్నారు. మరో 4ఎకరాల్లో సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్మాణం జరగనున్నట్లు చెప్పారు. మౌలిక వసతులు, సకల హంగులతో ఈ కార్యాలయాలు రూపుదిద్దుకోనున్నట్లు చెప్పారు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగిసేలా అధికారులు దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.

