
నిజామాబాద్ :- మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఆశా వర్కర్ల జిల్లా కమిటీ సమావేశంలో జిల్లాలోని వివిధ పీహెచ్‌సీలకు చెందిన ఆశా వర్కర్లు పాల్గొని తమ సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ. రమేష్‌బాబు మాట్లాడుతూ ఆశా వర్కర్లపై అధికారులు అధిక పని భారం మోపుతూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు.ఫీల్డ్‌లో పనిచేయాల్సిన ఆశా వర్కర్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు సబ్‌సెంటర్లలో విధులు నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నారని, గర్భిణీలు, బాలింతల పర్యవేక్షణ, ఇంటింటి సర్వేలు వంటి ముఖ్య పనులతో పాటు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. స్పుట్నిక్ బ్యాగులను మోసే పనులు కూడా ఆశా వర్కర్లకే అప్పగిస్తున్నారని విమర్శించారు.అనేకసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని, వేధింపులు కొనసాగితే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని తెలిపారు.ఈ సమావేశంలో ఆశా వర్కర్ల జిల్లా నాయకులు సుకన్య, రేణుక, విజయ, నర్సు, బాలమణి, వనిత, రాణి తదితరులు పాల్గొన్నారు.

