హంసవాహనంపై సరస్వతి స్వరూపుడై భక్తులను కటాక్షించిన గోవిందరాజస్వామి…

తిరుపతి :-తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు సరస్వతి దేవి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అభయప్రదాతగా వెలుగొందారు.రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది.వాహనం ముందు వృషభాలు, అశ్వాలు,గజరాజులు నడుస్తుండగా… చెక్కభజనలు, కోలాటాలు,గోవింద నామస్మరణలతో తిరుపతి మాడవీధులు మారుమోగాయి.మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవను తిలకించిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి దివ్యానుభూతిని పొందారు.

హంసవాహనం – జ్ఞానానికి ప్రతీక..
బ్రహ్మవాహనమైన హంస జ్ఞానానికి, వివేకానికి ప్రతీకగా పురాణాలు పేర్కొంటాయి.పాలను నీటిని వేరుచేసే హంస స్వభావం ఆత్మానాత్మ వివేకానికి సంకేతం. అందుకే పరమాత్మతో ఏకత్వం పొందిన మహనీయులను “పరమహంసులు”గా ఉపనిషత్తులు అభివర్ణించాయి. భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తిని ప్రసాదించేందుకే శ్రీహరి హంసవాహనాన్ని అధిరోహిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి.ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి,శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి,ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి,ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి,టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజయులు,ఆలయ అర్చకులు,విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment