
పాడేరు :- జిల్లాలో జనగణన ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని, ప్రతి ఓటరును సంబంధిత పోలింగ్ కేంద్రంతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిషాంతి.టి అధికారులను ఆదేశించారు. ఈఆర్వోలు, బీఎల్వోలు ఇతర పనులకు అంతరాయం కలగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా రెవెన్యూ అధికారులు, మండల తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెబ్‌ల్యాండ్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యలు, మ్యుటేషన్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పాత మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, అర్హులైన రైతులకు పట్టాదారు పాస్బుక్కుల పంపిణీ వేగవంతం చేయాలని తెలిపారు.
రీ-సర్వే పనుల్లో తలెత్తుతున్న సాంకేతిక లోపాలను సరిదిద్ది, సరిహద్దు వివాదాలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన కోర్టు కేసుల్లో కౌంటర్ అఫిడవిట్లను సకాలంలో దాఖలు చేయాలని చెప్పారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికల ద్వారా వచ్చే రెవెన్యూ అర్జీలను పారదర్శకంగా, ఆలస్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, ప్రభుత్వ మౌలిక వసతుల కోసం జరుగుతున్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, బాధితులకు నష్టపరిహారం సకాలంలో అందేలా చూడాలని తెలిపారు.నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, లేఅవుట్ల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూ సమస్యలకు సంబంధించిన 22ఏ నిషేధిత జాబితా సవరణలను గ్రామాల వారీగా సిద్ధం చేయాలని సూచించారు.ఆర్డీవోలు, తహశీల్దార్లు,సర్వే సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.పెండింగ్‌లో ఉన్న ఈ-కేవైసీ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, రేషన్ కార్డు దారుల ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ,పాడేరు ఐటిడిఏ పీవో ఆదిత్య వర్మ,జిల్లా ఇంచార్జ్ రెవెన్యూ అధికారి ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు,వివిధ మండలాల రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..

