
ఎన్‌సీసీ విద్యార్థులకు మే 21 నుండి 31 వరకు ఏ టి సి 4 వ క్యాంప్…
ఎన్‌సీసీ కెడేట్లు క్రమశిక్షణ,సేవాభావం,లక్ష్యసాధనతో ముందుకు సాగాలి
ఉన్నతమైన కలలు కనండి…వాటిని సాధించే వరకు కృషి చేయండి…
తిరుపతి :- ఎన్‌సీసీ విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావం, ఆత్మవిశ్వాసంతో దేశానికి గొప్ప ఆస్తి కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.మంగళవారం ఎన్‌సీసీ గర్ల్స్ బెటాలియన్‌లో నిర్వహించిన ఏటిసి 4 వ క్యాంప్ కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అనూజ్ వాద్వా, జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఎన్‌సీసీ విద్యార్థులకు మే 21 నుండి 31 వరకు ఏటిసి 4వ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, ఈ క్యాంప్ లో ఆంధ్రప్రదేశ్ లోని 5 జిల్లాలకు సంబంధించి దాదాపు 600 మంది ఎన్ సి సి విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు.ఎన్‌సీసీ గర్ల్స్ బెటాలియన్ క్యాంపస్‌కు రావడం ఆనందంగా ఉందని, రాష్ట్రంలోనే ఉత్తమ క్యాంపస్‌లలో ఒకటిగా ఈ క్యాంపస్ ను తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. తాను కూడా పాఠశాల దశలో ఎన్‌సీసీలో చేరానని, మొదట యూనిఫామ్ ఆకర్షణతో చేరినా,తర్వాత ఎన్‌సీసీ అసలు లక్ష్యం ఏమిటో అర్థమైందన్నారు.ఎన్‌సీసీ శిక్షణ ద్వారా క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. ఎన్‌సీసీ కేవలం సర్టిఫికెట్ల కోసం మాత్రమే కాదని, దేశానికి అవసరమైన సమయంలో ముందుండి సేవ చేయాలనే భావనను పెంచుతుందని పేర్కొన్నారు. వరదలు, భూకంపాలు,విపత్తులు, వీఐపీ పర్యటనలు వంటి సందర్భాల్లో ఎన్‌సీసీ కేడెట్లు ముందుండి సేవలందిస్తారని తెలిపారు. ఎన్‌సీసీ చేరడం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడుతుందని, కెరీర్ పరంగా అదనపు అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ఎన్‌సీసీ చేసిన తర్వాత విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం,లక్ష్యసాధనపై దృష్టి,నాయకత్వ లక్షణాలు మరింత పెరుగుతాయన్నారు. “సర్వీస్ టు నేషన్, సర్వీస్ టు హ్యూమానిటీ” అనే భావన ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు సమాజంలోని అత్యంత పేదవారికి ఉపయోగపడే పనులు చేయాలనే దృక్పథం కలిగి ఉండాలని తెలిపారు. విద్యార్థులు చిన్న వయస్సులోనే తమ భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. “ఎయిమ్ లేకపోతే జీవితంలో దిశ ఉండదు. పెద్ద కలలు కనండి, ఉన్నత లక్ష్యాలను పెట్టుకోండి” అని పిలుపునిచ్చారు.మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూచించినట్లు “నిద్రపోనివ్వని కలలే నిజమైన కలలు” అని పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తే సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వారూ అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని, డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు. కమాండింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రజాసేవా భావన, పట్టుదల మరియు కష్టపడి సాధించిన విజయాలకు ప్రతిరూపంగా నిలిచిన జిల్లా కలెక్టర్ వంటి ఉన్నతాధికారి సందర్శన క్యాడెట్లకు గొప్ప స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉండే బాధ్యతగల, క్రమశిక్షణ కలిగిన యువతను తీర్చిదిద్దడంలో బెటాలియన్ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

