ప్రభుత్వ విద్య పరిరక్షణకు సమాజం ముందుకు రావాలి : ఏఐఎస్ఎఫ్…

శ్రీకాళహస్తి :- ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని, ప్రతి తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని AISF తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి పరిస్థితుల్లో కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశాయని విమర్శించారు.పేద, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితిని ఆసరాగా చేసుకొని లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు పేరుతో కుటుంబాలు అప్పుల బారిన పడుతున్నాయని, ఫీజులు కట్టలేక అనేక మంది అవమానాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఒకప్పుడు గ్రామాలకు వెలుగునిచ్చిన ప్రభుత్వ పాఠశాలలు నేడు విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో బలహీనపడుతున్నాయని తెలిపారు. దీనికి ప్రధాన కారణం కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడమేనని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, స్కాలర్‌షిప్‌లు వంటి అనేక సదుపాయాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ విద్యపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వేలాది మంది నేడు డాక్టర్లు,ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, అధికారులు, శాస్త్రవేత్తలుగా ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ విద్య నాణ్యతలేదని చెప్పడం పూర్తిగా తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక బాధ్యత, మానవత్వం వంటి విలువలను నేర్పేది ప్రభుత్వ విద్యేనని అన్నారు.ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై నియంత్రణ తీసుకురావాలని కోరారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించి లక్షల రూపాయల ఫీజుల కోసం అప్పుల పాలవకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తును భద్రపరచాలని కోగిలి మునిచందు పిలుపునిచ్చారు.“ప్రభుత్వ పాఠశాల బలపడితేనే సమాజం బలపడుతుంది… ప్రభుత్వ విద్యను పరిరక్షిద్దాం – ప్రతి పిల్లవాడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దాం” అని ఆయన పేర్కొన్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment