
నెల్లిమర్ల :- మహిళల రక్షణ,సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది.ఇందులో భాగంగా భోగాపురం రూరల్ సర్కిల్ సి.ఐ జి.రామకృష్ణ,స్థానిక ఎస్.ఐ బి.గణేష్ శనివారం మండలంలోని కొత్తపేట చెరువు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళా కూలీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.క్షేత్రస్థాయిలోనే మహిళలకు చట్టాలపై, తమ రక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా సి.ఐ జి.రామకృష్ణ,ఎస్.ఐ బి.గణేష్ వివిధ సామాజిక అంశాలపై మహిళలకు సుదీర్ఘంగా వివరించారు. మహిళల భద్రత – ఈవ్ టీజింగ్ నిరోధం.సమాజంలో మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని అధికారులు స్పష్టం చేశారు.ఎవరైనా వేధింపులకు గురిచేస్తే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని ధైర్యం చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘శక్తి’ మొబైల్ యాప్‌ను ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలని,దీని ద్వారా విపత్కర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందుతుందని వివరించారు.ఆపదలో ఉన్నప్పుడు సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్ల గురించి కూలీలకు అవగాహన కల్పించారు. డయల్ 100 లేదా 112,మహిళల ప్రత్యేక హెల్ప్‌లైన్: 181,ఈ నంబర్లకు ఫోన్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు బాధితుల వద్దకు చేరుకుంటారని భరోసా ఇచ్చారు.
బాల్యవివాహాలు సామాజిక నేరం.“చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం చట్టరీత్యా నేరం.బాల్యవివాహాల వల్ల ఆడపిల్లల ఆరోగ్యం,భవిష్యత్తు నాశనమవుతాయి.మీ ప్రాంతంలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గంజాయి రహిత సమాజం.యువతను పట్టి పీడిస్తున్న గంజాయి మహమ్మారిపై ‘సంకల్పం 2.0’ లో భాగంగా గట్టి నిఘా ఉంచామని అధికారులు తెలిపారు.గంజాయి వినియోగం,రవాణా వల్ల కలిగే అనర్థాలను మహిళలకు వివరించారు.తమ గ్రామాల్లో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా,వాడుతున్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.అలాగే,మైనర్ పిల్లలు మొబైల్ ఫోన్లలో ఆన్‌లైన్ బెట్టింగుల బారిన పడకుండా తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.ఫోన్లకు వచ్చే లక్కీ డ్రా మెసేజ్‌లు,ఓటీపీలు,గుర్తుతెలియని లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు.ప్రయాణాల సమయంలో రోడ్డు నిబంధనలు పాటించాలని,హెల్మెట్ ధరించాలని మరియు అతివేగం ప్రమాదకరమని కూలీలకు ముందస్తు జాగ్రత్తలు చెప్పారు…



