ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతం…

పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేసిన ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి…
బందోబస్తు విధులను సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు,సిబ్బందిని అభినందించిన విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి…

శ్రీకాకుళం/నరసన్నపేట :- ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటన ప్రశాంతంగా,విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.శనివారం నరసన్నపేటలో నిర్వహించిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్నారు.ఈ పర్యటనకు సంబంధించి ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి,కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ తో కలిసి స్వయంగా భద్రతా పరమైన , ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించి,ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు.హెలిప్యాడ్,సభా ప్రాంగణం,పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన మార్గాలు మరియు ఇతర కీలక ప్రాంతాల్లో తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని నియమించి భద్రతా చర్యలు చేపట్టారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ,పోలీసు అధికారులకు అవసరమైన సూచనలు అందించి అప్రమత్తంగా వ్యవహరించారు.పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముఖ్యమంత్రి పర్యటన సజావుగా పూర్తైంది.ముఖ్యంగా ప్రజా రవాణాకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ చేపట్టడం విశేషం.ఈ సందర్భంగా బందోబస్తు విధులను నిబద్ధతతో నిర్వహించిన పోలీసు అధికారులు,సిబ్బందిని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి అభినందించారు.అలాగే జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి కూడా అన్ని విభాగాల పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment