
రామలింగ సత్యనారాయణను అభినందించిన మంత్రి లోకేష్,
అమరావతి :- అశోక చక్రంతో సహా ఎటువంటి అతుకులు లేని జాతీయ జెండాను 8×12 సైజులో తయారుచేసి పలు అంతర్జాతీయ రికార్డులు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ రాష్ట్ర విద్య,ఐటి శాఖల మంత్రి లోకేష్ ను ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్,ఇంటర్నేషనల్ టాలెండ్ అవార్డు (Dana, Usa),భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించిన రామలింగ సత్యనారాయణ…తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఎగురవేసే 6×12 జెండాను,తర్వాత ఎర్రకోటపై ఎగురవేసే 8×12 జాతీయ జెండాలను తయారుచేశారు.జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య స్పూర్తితో తాను తయారు చేసిన జాతీయజెండా ఒక్కసారైనా ఎర్రకోట పై ఎగరాలి, భారత దేశంలోనే అత్యంత అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాగా మన ఆంధ్రప్రదేశ్ కి గుర్తింపు రావాలన్నదే తన ఆకాంక్షగా రామలింగ సత్యనారాయణ చెప్పారు.ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన చేనేత జాతీయ జెండా (8×12).ఏకరీతిగా అశోక్ చక్రంలో దారాల అల్లిక చాలా కష్టమైనది.చిన్న పొరపాటు వచ్చినా మరలా మొదటి నుంచి అల్లిక ప్రారంభించాలి. అందుకనే ఎక్కువ సమయం (సుమారు 6 నెలలు) తీసుకుంటుంది.అన్నీ సజావుగా సాగితే తొందరగా పూర్తి అవుతుందని అన్నారు. జాతీయ జెండాలోని అశోకచక్రం నేతలో రావాలంటే 1200 గళ్లు గ్రాఫ్ అవసరం. ఒక్క గడి తేడా లేకుండా, మూడు రంగుల దారాలు ఒకదానికి మరొకటి కలవకుండా లింక్ వేసుకుని నేయాల్సి ఉందని తెలిపారు.తన మనసుకు దగ్గరైన చేనేతతో అతుకులులేని జాతీయ జెండా తయారుచేసిన రామలింగ సత్యనారాయణ కృషిని మంత్రి లోకేష్ అభినందించారు…



