
యలమంచిలి :- ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య,మెరుగైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని,తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు పిలుపునిచ్చారు.యలమంచిలి మండలం రామరాయుడుపాలెంలో నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమంలో ఆయన స్వయంగా ఇంటింటికీ తిరిగి గ్రామస్థులతో మాట్లాడారు.
తీవ్రమైన ఎండను సైతం లెక్కచేయకుండా డీఈఓ ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు,సదుపాయాలను వివరించారు.ఆయన చొరవతో ప్రభావితమైన తల్లిదండ్రులు వెంటనే ఎనిమిది మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు.స్థానిక ఉపాధ్యాయుడు వేగి రాజుబాబు,అంగన్‌వాడీ టీచర్ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి ఉపాధ్యాయులే ఆదర్శంగా నిలిచారు.
విద్యార్థుల సంఖ్య 40 దాటితే పాఠశాలను ‘మోడల్ ప్రైమరీ స్కూల్’గా అభివృద్ధి చేసి అదనపు ఉపాధ్యాయులను కేటాయిస్తామని డీఈఓ హామీ ఇచ్చారు. ‘తల్లికి వందనం‘ వంటి పథకాలు పేద విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తున్నాయని,కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నామని అన్నారు.కార్యక్రమంలో ఎంఈఓలు సూర్య ప్రకాష్,అరుణ్ కుమార్,ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు…



