
90 వసంతాల జాతీయోత్సవాల్లో వెళ్ళి విరిసిన రసతంత్రులు…
విశాఖ ఎంవిపి కాలని :- ప్రసారభారతి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శుక్రవారం సాయంత్రం కళాభారతి ప్రాంగణంలో నిర్వహించిన అలనాటి మధుర గీతాలు ఆద్యంతం మాధుర్యాన్ని పంచాయి. డా.ద్వారం వికెజి త్యాగరాజ్ సంగీత నిర్వహణలో 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఏర్పాటైన అలనాటి మధుర భావ గీతాలు మధురానుభూతిని పంచాయి.వందేమాతరం గీతంతో ప్రారంభమైన కార్యక్రమంలో అదిగదిగో అదే అదే..( కృష్ణ శాస్త్రి ), వెన్నెలేమో పంపింది..(ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గీతం) ను పవన్ కుమార్ చరణ్, సురభి శ్రావణి పాడారు.డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్.హర్షలత మాట్లాడుతూ ఆకాశవాణి ప్రస్థానాన్ని వివరించారు. విజ్ఞానం వినోదంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సేవలందిస్తోం దన్నారు.ఎఫ్ఎం ప్రారంభం తరువాత ప్రాచుర్యంలోకి వచ్చి ఎన్నో సేవలతో ముందుకు వెళుతున్నా మన్నారు. ప్రధాని మోదీ ఆకాశవాణిలో మనసులో మాటగా ప్రజలకు చేరువ చేస్తున్నా రన్నారు. డైరెక్టర్ ఇంజనీరింగ్ జె.కృష్ణారావు.మాట్లాడుతూ రాజమండ్రి, శ్రీకాకుళం, కాకినాడ, విశాఖపట్నంలతో పాటు ఏజెన్సీ చింతపల్లి, విజయనగరం, సింహాచలం ప్రాంతాల నుండి కూడా నాణ్యమైన కార్యక్రమాలు ఎఫ్.ఎం ల ద్వారా త్వరలో అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ ద్వారా కూడా మరింత సేవలను విస్తృతం చేస్తామన్నారు.కార్యక్రమ విభాగాధిపతి పివి రామ్ గోపాల్ మాట్లాడుతూ ఆలిండియా రేడియో గా ఉన్న వ్యవస్థ ఆకాశవాణిగా మారడంతో 1952లో తీసుకున్న నిర్ణయంతో లలిత సంగీతం ప్రారంభం అయ్యిందన్నారు. 1957 లో మొదలైన వివిధ భారతి కాలక్రమంలో చోటు చేసుకున్న మార్పులు వివరించారు.జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ ఆకాశవాణి అందరిదీ అన్నారు.ఆకాశవాణి 90 వసంతాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆనంద దాయక మన్నారు. ఆకాశవాణి అంటే నిబద్ధతకు మారు పేరు అన్న ఆయన ఎప్పటికీ ఆకాశవాణి సమయ పాలన నిర్ధిష్టమైన దన్నారు. ఇదే వేదికపై జీవీఎంసీ అదనపు కమిషనర్ నల్లనయ్య,ద్వారం త్యాగరాజు లను ఉచిత రీతిన సత్కరించారు.ఆకాశవాణి సీనియర్ అనౌన్సర్ రాంభట్ల నృసింహ శర్మ మాస్టర్ ఆఫ్ శర్మనీ గా వ్యవహరించిన కార్యక్రమంలో,సహాయ సంచాలకులు కె.ఇందిర,కార్యక్రమ నిర్వహణ అధికారులు సంఘమిత్ర,సుధాకర రెడ్డి,దిలీప్ కుమార్ రెడ్డి తదితరులు సారధ్యం వహించారు…



