
ప్రతి సోమవారం పీజీఆర్ఎస్,ఐవీఆర్ఎస్ సమీక్ష శాఖల సమన్వయం బలోపేతం చేయాలి…జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్…
రంపచోడవరం :- జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సోమవారం సాయంత్రం ఐటీడీపీవో సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, నిర్దేశిత గడువు దాటి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు. సమస్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు పీజీఆర్ఎస్ డిస్పోజల్, ఐవీఆర్ఎస్‌పై సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల వివరాలను సమీక్షించి, క్షేత్ర స్థాయి అధికారులతో సమన్వయం పెంచాలని సూచించారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సమగ్రంగా పర్యవేక్షించాలని, గత నెల కంటే ఈ నెల పంపిణీ శాతం తగ్గిన కారణాలపై విశ్లేషణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గత నెలలో చూపిన పనితీరు ఈ నెల ఎందుకు తగ్గిందో విశ్లేషించాలన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా అందిస్తున్న పౌర సేవల పనితీరు సంతృప్తికరంగా లేదని పేర్కొంటూ, ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు..
జిల్లాలో ఉత్తమంగా పనిచేసిన ఐదు సచివాలయాలు, తక్కువ పనితీరు చూపిన ఐదు సచివాలయాలపై ప్రగతి ఆధారంగా విశ్లేషణ చేపట్టనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. తక్కువ పనితీరు చూపిన గ్రామ మండల అధికారులు, సిబ్బంది పనితీరు జిల్లా ప్రగతిపై ప్రభావం చూపుతోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, చిన్నారులు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, విద్యుత్ సరఫరా వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతితో పాటు లోపాలను కూడా విశ్లేషించాలని తెలిపారు. పనితీరు మెరుగుపడేందుకు ఏ చర్యలు ఉపకరిస్తున్నాయో, ఎక్కడ లోపాలు ఉన్నాయో వివరంగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ఇసుక సరఫరా విషయంలో ప్రజల సంతృప్తి తగ్గిందని పేర్కొంటూ,సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శాఖ పనితీరును నెలకు ఒకసారి సమీక్షించడంతో పాటు, వారానికి ఒకసారి అంతర్గతంగా విశ్లేషణ చేసి సిద్ధంగా ఉండాలని అధికారులకు తెలిపారు.పనితీరు మెరుగు పరచకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్క శాఖ పని తీరును సమీక్ష నిర్వహించండం జరుగుతుంది అని తెలియ చేశారు. త్వరలో పోలవరం జిల్లా పర్యటనకి ముఖ్యమంత్రి వొచ్చే అవకాశం ఉందని, అందుకు అనుసరించి అధికారులు మెరుగైన పనితీరుతో సిద్ధంగా ఉందన్నారు. పనితీరు లోపించిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే సస్పెన్షన్ కూడా అమలు చేయాలని స్పష్టం చేశారు. అయితే పనితీరు మెరుగుపరిస్తే సస్పెన్షన్‌ను ఉపసంహరించనున్నట్లు తెలిపారు.రాబోయే మే 7,8 తేదీల్లో జరగనున్న కలెక్టర్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, సర్క్యులర్లు, గత కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఆదేశాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని దినేష్ కుమార్ సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్య కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేసి వారి సంతృప్తి స్థాయిని పెంచే బాధ్యత అధికారులదేనని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు.ఈ సమీక్ష లో జిల్లా అధికారులు పాల్గొన్నారు.



