
విజయనగరం :- ఫిర్యాదు దారులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఎస్పీ దామోదర్ ఆదేశించారు. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ”ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని ఎస్పీ సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారు 33 ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించినవి 7, కుటుంబ కలహాలకు సంబంధించినవి 6, చీటింగుకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించినవి 19 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను కోరారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిసిఆర్బి సిఐ కే.కుమారస్వామి, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, ఎస్ఐలు రాజేష్, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు…



