మాకన్నపల్లిలో పోలీసుల అవగాహన గర్జన..! “సైబర్ మోసాలకు చెక్..

పలాస:- గ్రామ భద్రతకు ప్రజల భాగస్వామ్యం కీలకం” మహిళా రక్షణ నుంచి ఎన్నికల శాంతి వరకు..గ్రామస్తులకు కాశీబుగ్గ పోలీసుల స్పష్టమైన దిశానిర్దేశం పేకాట,గంజాయి,నాటు సారా అక్రమాలపై ఉక్కుపాదం తప్పదని హెచ్చరిక “ఓటీపీ,బ్యాంకు వివరాలు చెప్పొద్దు..అనుమానాస్పద ఘటనలు వెంటనే పోలీసులకు తెలియజేయాలి” మతపరమైన కార్యక్రమాలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచన.. దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మాకన్నపల్లి గ్రామంలో కాశీబుగ్గ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం గ్రామస్తుల్లో చైతన్యం నింపింది. మహిళా భద్రత నుంచి సైబర్ నేరాల వరకు.. పేకాట, గంజాయి అక్రమాల నుంచి ఎన్నికల శాంతి భద్రతల వరకు పలు కీలక అంశాలపై పోలీసులు ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు.కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్.నరసింహమూర్తి తన సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించి గ్రామ జంక్షన్ వద్ద ప్రజలతో సమావేశమయ్యారు.గ్రామ భద్రతలో ప్రజల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ అప్రమత్తతే రక్షణ అని వివరించారు.మాకన్నపల్లి గ్రామంలో కాశీబుగ్గ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందన లభించింది.గ్రామ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్.నరసింహమూర్తి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.

మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న ఎస్సై..మహిళలపై వేధింపులు,అనుమానాస్పద ఘటనలు,గృహ హింస వంటి సంఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.అత్యవసర సమయాల్లో 112 సేవలను వినియోగించుకోవాలని మహిళలకు అవగాహన కల్పించారు. “నారీ శక్తి సమాజానికి బలం..మహిళల రక్షణ అందరి బాధ్యత” అని పేర్కొన్నారు.ఇటీవల కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై గ్రామస్తులను ప్రత్యేకంగా అప్రమత్తం చేశారు. మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయవద్దని,ఓటీపీలు,బ్యాంకు ఖాతా వివరాలు,ఏటీఎం పిన్ నంబర్లు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.సోషల్ మీడియా ద్వారా మోసగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మభ్యపెడుతున్నారని,తెలియని కాల్స్‌,మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతను తప్పుదోవ పట్టిస్తున్న పేకాట,ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌,గంజాయి వినియోగం,నాటు సారా తయారీ మరియు అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.గ్రామాల్లో ఎక్కడైనా ఇటువంటి అక్రమ కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై రాజీ లేకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్సై పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో వర్గవిభేదాలు,గొడవలు,ఉద్రిక్తతలకు దూరంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని తెలిపారు.అలాగే గ్రామాల్లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు దేవాలయాలు,మసీదులు,చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.పండుగలు,ఉత్సవాలు,మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే ముందు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.గ్రామ భద్రతలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పోలీసులు నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి గ్రామస్తులు,యువత,మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.సైబర్ నేరాలు,మహిళా రక్షణ,గ్రామ భద్రత,ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై పోలీసులతో చర్చించారు.గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల సూచనలు ఉపయోగపడతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment