సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించండి…

అవగాహనా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించండి
ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్…

రాజమహేంద్రవరం ప్రతినిధి :- నానాటికీ పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని,ప్రజల్లో సైబర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ జిల్లా పోలీసు అధికారులకు ఆదేశించారు.గురువారం రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ కార్యాలయాన్ని ఐజీ ఇన్స్పెక్షన్ చేశారు.కార్యాలయ నిర్వహణ,శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డీ నరసింహ కిషోర్, ఈస్ట్ జోన్ డీఎస్పీ బీ విద్య హాజరయ్యారు. సమీక్షలో భాగంగా కార్యాలయ పరిపాలన, రికార్డుల నిర్వహణ,పెండింగ్ కేసుల స్థితి,నేర నియంత్రణ చర్యలు,శాంతిభద్రతల పరిస్థితులపై ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అధికారులతో చర్చించారు.అనంతరం జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న శక్తి టీమ్‌లు,నిఘా బృందాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి పనితీరు,సమాచార సేకరణ విధానాలు,మహిళల భద్రత కోసం చేపడుతున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ మహిళలు,బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈవ్ టీజింగ్, వేధింపులు,మహిళలపై జరిగే నేరాల నివారణలో శక్తి టీమ్‌లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.ముఖ్యంగా పాఠశాలలు,కళాశాలలు,రద్దీ ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తూ ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని,ప్రజల్లో సైబర్ అవగాహనా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.ఆన్ లైన్ లో ఫేక్ లింకులు,ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేర నియంత్రణలో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు,ఎస్సైలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment