ఆదర్శమూర్తి బిక్కిన వీర్రాజు మృతి…

మరణానికి ముందే తన శరీరాన్ని రంగరాయ మెడికల్ కళాశాలకు అప్పగించాలని నిర్ణయం
కుటుంబ సభ్యులను ఒప్పించి సంతకాలు సేకరించిన వీర్రాజు
ఆదర్శంగా నిలుస్తున్న వీర్రాజు నిర్ణయం

మండపేట :- పట్టణ ప్రముఖుడు, బిక్కిన చిన్న సోదరుడు, వీబీసీ న్యూస్ మాజీ డైరెక్టర్ బిక్కిన బాలయ్య తండ్రి బిక్కిన వీర్రాజు (84) శనివారం రాత్రి వృద్ధాప్యంతో మృతి చెందారు. కాగా ఈయన గొప్ప ఆదర్శ భావాలతో తన పార్థివ దేహాన్ని కాకినాడ ఆర్ఎంసీకి అప్పగించాలని ఇంతకు ముందే నిర్ణయించుకున్నారు. అంతే గాకుండా తన భార్యా బిడ్డలు ఇతర కుటుంబ సభ్యులందరినీ ఇందుకు కష్టపడి ఒప్పించి ముందే వారి నుండి సంతకాలు తీసుకున్నారు. తన మరణానంతరం శరీరాన్ని కళాశాలకు అప్పగించేలా మార్గం సుగమం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల నుండి వైద్య నిపుణులు విచ్చేసి ఈయన దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైద్య విద్యార్థుల పరిశోధనలు నిమిత్తం ఈయన దేహాన్ని వినియోగించనున్నారు. వైద్య కళాశాలకు ఇటువంటి అవసరం ఎంతో వుంటుంది. ప్రతి శరీర భాగం పైనా వారు నేరుగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ముందుగానే గుర్తించిన వీర్రాజు తన శరీరం వైద్య విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపయోగపడాలని ఈ నిర్ణయం తీసుకున్నారు

ఇటువంటి ఆదర్శ ప్రాయ నిర్ణయం సమాజానికి ఎంతో అవసరం. వీర్రాజు ను ఆదర్శంగా తీసుకుని సమాజంలో పలువురు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి, ప్రముఖ వైద్యుడు బిక్కిన గోపాల కృష్ణ, ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత వల్లూరి చిన్నారావు, మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణ, డాక్టర్ బీటీ చౌదరి తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

ఎమ్మెల్యే వేగుళ్ళ సంతాపం…

తన శరీరాన్ని మెడికల్ కళాశాలకు దానం చేయడం ద్వారా సమాజ సేవకు కొత్త అర్థాన్ని ఇచ్చిన మహనీయుడిగా బిక్కిన వీర్రాజు నిలిచిపోతారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట పాటిమీద వద్ద గల వీర్రాజు నివాస గృహానికి చేరుకున్న ఎమ్మెల్యే వేగుళ్ళ..బిక్కిన వీర్రాజు మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బిక్కిన కుటుంబంలో ఇది రెండవ త్యాగమని ఆయన కొనియాడారు. గతంలో బిక్కిన చక్రవర్తి కుమారుడి అవయవ దానం ద్వారా పలువురి జీవితాల్లో వెలుగులు నింపితే..ప్రస్తుతం వీర్రాజు వైద్య విద్యార్థులకు తన శరీరాన్ని దానం చేయడం ద్వారా విద్యాదాత గా నిలిచారని అన్నారు. వీరి సేవలు చిర స్థాయిగా నిలిచిపోతాయన్నారు. వీర్రాజు కుటుంబంతో తనకెంతో సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment