
నియోజకవర్గ రూపురేఖలు మారుస్తున్న ఉప ముఖ్యమంత్రి!
వందల కోట్లు రూపాయల పెట్టుబడులు, యువతకు ఉపాధి మార్గం దిశగా అడుగులు
19 ఆలయాల పునరుద్ధరణ..మత్స్యకార,రైతు సంక్షేమానికి కోట్లాది రూపాయల నిధులు
పిఠాపురం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి చేపట్టిన వివిధ కార్యక్రమాలు, మంజూరైన నిధుల వివరాలను ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ మేరకు విడుదల చేసిన అధికారిక లేఖలో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు.
అభివృద్ధి అంటే కేవలం కాగితాల మీద పెట్టే సంతకాలు కాదు, సామాన్యుడి కళ్లలో కనిపించే సంతృప్తి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతారు. ఆ నమ్మకానికి తగ్గట్టే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వందల కోట్ల రూపాయల నిధులను మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, ఆధ్యాత్మిక, పారిశ్రామికాభివృద్ధిపై ఖర్చు చేస్తున్నారు.
పారిశ్రామిక ప్రగతి – వేల కోట్ల పెట్టుబడులు
పిఠాపురం నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ ముందడుగు వేస్తున్నారు. 18 నెలల్లో దాదాపు రూ. 34,853 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించారు. వీటి ద్వారా 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనివ్వడం కోసం రూ. 9.6 కోట్లతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారు.
రూ.34,844 కోట్ల భారీ పెట్టుబడితో గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది.
మౌలిక వసతులు – మురికివాడల రూపురేఖల మార్పు.
పిఠాపురం పట్టణంలో 30 మురికివాడల్లోని 35 వేల మంది జనాభా దశాబ్దాల నిర్లక్ష్యం నుంచి బయటపడుతున్నారు.కోట్ల రూపాయల నిధులతో పారిశుధ్య పనులు ఊపొందుకున్నాయి. ఇటీవలే పిఠాపురం మున్సిపాలిటీలో 40 మంది పారిశుధ్య కార్మికులను కూడా తాత్కాలిక ప్రతిపాదకన నియమించారు

రహదారుల అభివృద్ధి,నియోజకవర్గంలో సుమారు రూ. 234 కోట్ల అంచనా వ్యయంతో 409 రోడ్ల పనులు జరుగుతున్నాయి. ఏకే మల్లవరం-ఉప్పరగూడెం, చిత్రాడ-గోర్స వంటి కీలక రహదారుల నిర్మాణం ప్రారంభమైంది.
తీర రక్షణ.
ఉప్పాడ తీరంలో సముద్ర కోతను నివారించడానికి రూ. 323 కోట్ల వ్యయంతో శాశ్వత సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టనున్నారు.
రవాణా సౌకర్యాలు* అమృత్ భారత్ పథకం కింద రూ. 37.25 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.
దేవాదాయాభివృద్ధి – ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం.
సుమారు రూ. 20 కోట్ల నిధులతో 19 ప్రధాన దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు.పురాతన,శిథిలావస్థకు చేరిన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తున్నారు.
ప్రధాన ఆలయాలు: కుక్కుటేశ్వర స్వామి,పురుహూతికా దేవి ఆలయాల అభివృద్ధికి రూ. 6 కోట్లు కేటాయించారు.దీని ద్వారా పిండ ప్రదాన,అన్నదాన మండపాల నిర్మాణం చేపడతారు.
నూకాలమ్మ దేవాలయానికి రూ. 28 లక్షలు,పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి రూ. 65 లక్షలు,సకలేశ్వర స్వామి దేవాలయానికి రూ. 1.10 కోట్లు మంజూరు చేశారు.
పాద వల్లభ మహా సంస్థానంలో డార్మిటరీ, ధ్యాన మందిరాల కోసం రూ. 4.10 కోట్లు కేటాయించారు.
రైతు సంక్షేమం – అన్నదాతకుఅండ.
అన్నదాతలకు అండగా నిలిచేలా అకాల వర్షాలు,తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు రూ. 25.85 కోట్ల పరిహారం ప్రభుత్వం నుంచి అందేలా చూశారు.
ఆర్థిక సాయం: అన్నదాత సుఖీభవ పథకం కింద 23,105 మంది రైతులకు రూ. 42.75 కోట్లు అందజేస్తున్నారు.
పట్టు సాగు: చేబ్రోలు పట్టు రైతులకు బైవోల్టిన్ ప్రోత్సాహక కార్యక్రమం కింద రూ. 3.05 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఉద్యాన పంటలు: 956 మంది ఉద్యాన రైతులకు రూ. 96.18 లక్షలు నేరుగా నగదు సహాయం అందించారు.
మత్స్యకార,పాడి పరిశ్రమ అభివృద్ధి.
కోనపాపపేటలో రూ. 2 కోట్లతో కోస్టల్ ఫిషింగ్ విలేజ్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 672 పడవలకు రూ. 1.95 కోట్లతో ట్రాన్స్పాండర్లు అమర్చారు. 7,017 మంది మత్స్యకారులకు రూ. 14.03 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.
అమీనాబాద్ లో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నారు.
పాడి పరిశ్రమ: 14,184 పాడి రైతుల సంక్షేమం కోసం రూ. 2.20 కోట్లు ఖర్చు చేశారు.కొత్త పశువైద్యశాలల నిర్మాణానికి రూ. 1.92 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

విద్య, వైద్య రంగం…
పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను రూ. 34 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. 66 మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించనున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాల కల్పన కోసం రూ. 1.37 కోట్లు కేటాయించారు. ఐఐటీ, నీట్ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థుల కోసం అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.మురికివాడల అభివృద్ధి నుంచి భారీ పరిశ్రమల స్థాపన వరకు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గం నేడు ప్రగతికి చిరునామాగా మారింది.
నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఈ ప్రకటనలో తెలియజేశారు. ఎన్నో దశాబ్దాల నుండి పిఠాపురంలో పెండింగ్‌లో ఉన్న పలు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని ఆయన ఇప్పటికే హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు, ప్రతి సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నివేదికలో స్పష్టం చేశారు.



