
పార్వతీపురం :- : హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితుల స్మారకార్థం మరియు వారి పట్ల సంఘీభావాన్ని చాటుతూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు అన్నారు.అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ ప్రాంగణం వరకు ఆదివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.మేము గుర్తుంచుకుంటాం,మేము అవగాహనతో ముందుకెళ్తాం,మేము చర్య తీసుకుంటాం అనే నినాదంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో డాక్టర్ జగన్ మోహన్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం మే నెల మూడవ ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం గా పాటిస్తారని, ఎయిడ్స్ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడం,ప్రస్తుతం హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి మద్దతు తెలియజేయడం,ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు.అలాగే సమాజంలో ఎయిడ్స్ బాధితులపై ఉన్న వివక్షను తొలగించడం, వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం మరియు మెరుగైన వైద్య సేవలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపిఎస్ఎసిఎస్,దిశ జిల్లా సిబ్బంది జె. సంతోష్ కుమార్, కోటి, నేత్ర వైద్య అధికారి జె. నాగేష్ రెడ్డి, ఏ.ఆర్.టి, ఐసిటిసి,డిఎస్ఆర్ సిబ్బంది,వైడిఓ ఎన్జీఓ,సి ఎస్.సి సిబ్బంది,లింక్ వర్కర్స్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది,ఎన్జీఓ లు పాల్గొన్నారు…



