
సూళ్లూరుపేట :
గంజాయి,పేకాట,కోడిపందాల స్థావరాలపై కఠిన చర్యలు తప్పవు.
సమాచారం ఇచ్చే వారి వివరాలు అత్యంత గోప్యత..పోలీసుల ప్రత్యేక నంబర్లు విడుదల.
తప్పుడు మార్గాల్లో వెళ్లి భవిష్యత్తును జైలు పాలు చేసుకోవద్దు:యువతకు హితవు.
సూళ్ళూరుపేట :-ఆంధ్ర-తమిళనాడు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో భద్రతా పరంగా ఈ ప్రాంతం అత్యంత కీలకమైనదని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ స్పష్టం చేసారు తిరుపతిజిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో నియోజకవర్గ పరిధిలో భద్రతను, నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సూళ్ళూరుపేట,తడ మండలాల పరిధిలోని సుమారు 30 మంది పాత నేరస్థులను పిలిపించి పోలీసు యంత్రాంగం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.పాత నేరస్థులే కాకుండా,కొత్తగా ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా సీఐ ఎం.మురళీకృష్ణ మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఎక్కడ ఏ చిన్న అసాంఘిక ఘటన జరిగినా,ఎలాంటి నేరం జరిగినా అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు.పరిధిలోని గ్రామాల్లో గానీ,పట్టణాల్లో గానీ గంజాయి అమ్మకాలు, రవాణా, మహిళలపై అఘాయిత్యాలు, పేకాట స్థావరాలు, కోడిపందాలు వంటి చట్టవిరుద్ధమైన పనులు ఎక్కడ జరుగుతున్నా ప్రజలు తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.సమాచారం అందించిన వారి పేర్లు,వివరాలను అత్యంత రహస్యంగా (గోప్యంగా) ఉంచుతామని, కాబట్టి ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి తోక జాడిస్తే ‘పీడీ యాక్ట్’ (PD Act) కింద కఠిన చర్యలు తీసుకుని, నేరుగా జైలుకు పంపుతామని హెచ్చరించారు.ప్రజలు అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించడానికి క్రింది అధికారిక ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
సమాచారం కోసం పోలీస్ అధికారుల నంబర్లు:
సూళ్ళూరుపేట సీఐ ఎం.మురళీకృష్ణ: 9440796360
సూళ్ళూరుపేట ఎస్సై: 9440796361
తడ ఎస్సై: 9440796362.
అనంతరం సీఐ ఎం.మురళీకృష్ట యువతకు కీలక హితవు పలికారు. క్షణికావేశంలో తప్పుడు మార్గాల్లోకి వెళ్లి జీవితాలను,బంగారు భవిష్యత్ జైలు పాలు చేసుకోవద్దని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి యువకుడి వెనుక వారిని నమ్ముకున్న కుటుంబాలు,తల్లిదండ్రులు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మన సూళ్ళూరుపేట, తడ పరిసర ప్రాంతాలలో ఎన్నో జాతీయ,అంతర్జాతీయ పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయని..యువత చెడు సావాసాలు వీడి,ఆయా పరిశ్రమల్లో గౌరవప్రదమైన ఉద్యోగాలు లేదా ఉపాధి అవకాశాలు పొంది, కుటుంబాలకు ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కూడా చర్యలను మరింత ముమ్మరం చేస్తున్నట్లు మీడియాతో సీఐ వెల్లడించారు…


