
నర్సీపట్నం రూరల్ :- ఉన్నతాధికారుల ఆదేశాలపై గంజాయి తదితర మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.ఇటీవల పలుచోట్ల గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులను పట్టుకుని కేసులు నమోదు చేశారు. తాజాగా శుక్రవారం నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ ఆధ్వర్యంలో నర్సీపట్నం రూరల్ పోలీసులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ అందించిన వివరాల ప్రకారం,ఉన్నతాధికారుల ఆదేశాలతో ముందుగా అందిన సమాచారంతో రూరల్ సీఐ రేవతమ్మ, నర్సీపట్నం రూరల్ ఎస్ ఐ పి రాజారావు సిబ్బందితో నెల్లిమెట్ట వద్ద తనిఖీలు చేపట్టి,గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.ఈ కేసులో ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం,పరిటాల గ్రామానికి చెందిన చల్లా గోపి (25), ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి జిల్లా పప్పులూరు పంచాయతీ ఏనుగురాయి గ్రామానికి చెందిన మహదేవ్ ఖిలా (23) లను అరెస్టు చేసి వారి వద్ద నుండి బహిరంగ మార్కెట్లో రూ 12 లక్షల 70 వేల విలువైన 25 కిలోల గంజాయి,రెండు మొబైల్ ఫోన్లు, రూ.1000 నగదును స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ తెలిపారు.గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు…



