ఏలూరులో ఇంటర్, ఎస్సెస్సీ రెమెడీయల్ తరగతులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి…

ఏలూరు :- జిల్లాలో ఎస్సెస్సీ, ఇంటర్మీడియేట్ పరీక్షలలో ఫెయిల్ ఐన విద్యార్ధులకు ప్రత్యేకంగా రెమెడీయల్ తరగతులు నిర్వహించి ఉతీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.స్థానిక కొత్తదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను, 12 పంపుల సెంటర్ వద్ద గల గాంధీనగర్ నగరపాలక సంస్థ హై స్కూల్ లో నిర్వహిస్తున్న రెమెడీయల్ తరగతులను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతులకు హాజరుకాని విద్యార్థులకు ఫోన్ చేసి వారి తల్లితండ్రులతో కలెక్టర్ మాట్లాడారు. రెమెడీయల్ తరగతులకు విద్యార్థులు రాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్, ఎస్సెస్సీ లో ఫెయిల్ ఐన విద్యార్థులకు ప్రత్యేకంగా రెమెడీయల్ నిర్వహించి వారిని సప్లిమెంటరీ పరీక్షలలో ఉతీర్ణులు అయ్యేలా ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేస్తున్నారని, తమ పిల్లలను రెమెడీయల్ క్లాసులకు తప్పనిసరిగా పంపించాలని తల్లితండ్రులను కలెక్టర్ ఫోన్ ద్వారా కోరారు. విద్యార్థులకు బోదిస్తున్న టెక్స్ట్ బుక్స్ పరిశీలించి, ఉపాధ్యాయులను బోధన తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 3488 మంది, రెండవ సంవత్సరం పరీక్షలలో 2768 మంది మొత్తం 6256 మంది ఫెయిల్ అయ్యారని, అదేవిధంగా 10వ తరగతిలో 3654 మంది ఫెయిల్ అయ్యారన్నారు. ఏ ఏ సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారో తెలుసుకుని, వారికి ఆ సబ్జెక్టులను పూర్తిగా అర్థమయ్యేలా రెమెడీయల్ తరగతులలో బోధన చేయాలన్నారు.ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుండి, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభమవుతాయన్నారు. రెమెడీయల్ తరగతులకు విద్యార్థులు అందరూ హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, హాజరుకాని విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు ఫోన్ చేసి తప్పనిసరిగా తరగతులకు హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment