
కాకినాడ :- కాకినాడ లో ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని, ఇతర కారణాలు చెప్పి తప్పించుకోజాలరని ట్రాఫిక్-1 సిఐ ఎన్.లక్ష్మీ రమేష్ అన్నారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్-1 పోలీసులు స్థానిక కల్పనా సెంటర్ వద్ద హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అనే నినాదంతో వాహనదారులకు విస్తృత మంగళవారం అవగాహన కల్పించారు. హెల్మెట్ మర్చి పోయిన వారిని ఇంటి వద్ద నుండి హెల్మెట్ తెప్పించుకుని హెల్మెట్ ధరించి వెళ్లేటట్లు,హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి 1,000 రూపాయల జరిమానా విధించడానికి బదులుగా,వారిచే అక్కడికక్కడే కొత్త హెల్మెట్లు కొనిపించి, వాటిని ధరింపజేసి సురక్షితంగా పంపడం ద్వారా పోలీసులు వినూత్న రీతిలో స్పందించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,అలాగే ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, బైక్ స్టంట్స్ వంటి ప్రాణాపాయ చర్యలకు పాల్పడకూడదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, అతివేగం మరియు అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగు తున్నాయని, రెడ్ సిగ్నల్ పడినప్పుడు తప్పనిసరిగా స్టాప్ లైన్ వెనుక వాహనాలను ఆపాలని సూచించారు. ముఖ్యంగా కాకినాడ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏ ఎన్ పి ఆర్ ) కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించిన వారిపై ఆటోమేటిక్ ఫైన్ జనరేషన్ సిస్టమ్ ద్వారా ఇ-చలానాలు నేరుగా జారీ చేయబడతాయని, సాంకేతికత పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.సదరు ట్రాఫిక్ కౌన్సిలింగ్ ద్వారా సుమారు 20 మంది వాహనదారులు కొత్తగా హెల్మెట్లు కొనుగోలు చేసి, ధరించి వెళ్లారు. హెల్మెట్ ఇంటి వద్ద మరిచి పోయిన కొంతమంది వాహనదారులు ఇంటి వద్ద నుండి హెల్మెట్ తెప్పించుకుని తలకు ధరించి ద్విచక్ర వాహనం నడిపేటట్లు చేసినారు.ఇకపై రోడ్డు మీదకు బైక్ పై వస్తే హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణిస్తామని వాహన దారులు అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్-1 ఇన్స్పెక్టర్ ఎన్. రమేష్, ఎస్.ఐ పి. కిషోర్ కుమార్,టి.ఆర్.ఎస్.ఐ సత్యనారాయణ మరియు సిబ్బంది పాల్గొని రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు…



