
లేబర్ కోడ్స్ రూల్స్ రద్దు చేయాలి సిఐటియు డిమాండ్,జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వ గెజిట్ కాపీలు దగ్ధం…
విశాఖ సిటీ…కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని,వాటిని ఉపసంహరించుకోవాలని సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ సిహెచ్.నర్సింగరావు డిమాండ్ చేశారు.
సిఐటియు అఖిలభారత కమిటీ పిలుపు మేరకు,లేబర్ కోడ్స్ రూల్స్ అమలుకు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ప్రభుత్వ గెజిట్ కాపీలను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కార్మికులను బానిసలుగా మార్చే, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే లేబర్ కోడ్స్ అమలు కోసం కేంద్రం రూల్స్ విడుదల చేసిందని ఆయన విమర్శించారు.వీటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రూల్స్ తయారు చేసుకోవాలని కేంద్రం సూచించిందన్నారు.ఈ రూల్స్ అమలైతే కార్మికులు తీవ్రంగా నష్టపోతారని,ఇప్పటివరకు అనుభవిస్తున్న అన్ని హక్కులను కోల్పోతారని తెలిపారు.పని గంటలు,జీతభత్యాలు,ఉద్యోగ భద్రత వంటి అంశాలపై స్పష్టత లేకుండా యాజమాన్యానికే పూర్తి సర్వహక్కులు కట్టబెట్టేలా రూల్స్ ఉన్నాయని ఆరోపించారు.ఇది పూర్తిగా కార్పొరేట్లకు లాభం చేకూర్చి కార్మికులను బానిసలుగా మార్చే కుట్రని మండిపడ్డారు.

మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా,లేబర్ కోడ్స్ రద్దు అయ్యే వరకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే.ఎస్.వి.కుమార్,రాష్ట్ర కార్యదర్శి పి.మణి,విశాఖ జిల్లా పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్.జ్యోతీశ్వరరావు,ఎం.సుబ్బారావు,జిటి ప్రకాష్,చిన్నప్పుడు,వి.కృష్ణారావు,ఎం.సూరీడు,పోలేశ్వరరావు,చంద్రమౌళి,సత్యనారాయణ,జగన్నాథం తదితరులు పాల్గొన్నారు…



