
హెచ్ఆర్ విభాగం వైఖరిపై ఏపీ ప్రజా సంఘాల జేఏసీ ఆవేదన,దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కేకే లైన్ కలపాలి నిరసన ప్రదర్శన…
విశాఖ సిటీ :- విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా ఢిల్లీలోని రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయం హెచ్ఆర్ విభాగం తెలుగు ఉద్యోగుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జె.టి.రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.భువనేశ్వర్‌లో పనిచేస్తున్న తెలుగు ఉద్యోగులకు ఎన్ఓసిలు ఇవ్వకుండా విశాఖ జోన్‌కు రానివ్వడం లేదని,అలాగే ఇక్కడ ఉన్న బీహార్,బెంగాల్,ఒడిషా వారిని వెనక్కి పంపడం లేదని ఆరోపించారు.ఈ మేరకు ఆదివారం మద్దిలపాలెం,తెలుగు తల్లి జంక్షన్ దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఉద్యోగుల విభజన,ట్రాన్స్ఫర్లు, సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు.విశాఖ రైల్వే జోన్ కోసం దశాబ్దాలుగా ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే,ఇప్పుడు పరిపాలనా స్థాయిలో జరుగుతున్న వివక్ష ఉద్యమకారుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు.తెలుగు ఉద్యోగులకు ఎన్ఓసిలు వెంటనే మంజూరు చేయాలని,విశాఖ జోన్‌కు రావాలనుకునే వారికి అవకాశం కల్పించాలని,సీనియారిటీ,ప్రమోషన్ల రక్షణపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని,హెచ్ఆర్ విభాగం వివక్షపూరిత విధానాలను నిలిపివేయాలని,స్థానిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
ప్రశాంత వాతావరణంలో ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం,రైల్వే శాఖ వెంటనే జోక్యం చేసుకుని చర్చలకు రావాలని కోరారు.
సీనియర్ రైల్వే కార్మిక నేత కె.రామచంద్ర మూర్తి మాట్లాడుతూ,
కేకే లైన్ ను దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలపకుండా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. సంపూర్ణ రైల్వే జోన్ ఇవ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తారా? అని ప్రశ్నించారు. విశాఖ జోన్‌ను బలహీనపరిచే కుట్రలు వెంటనే ఆపాలన్నారు. గెజిట్ నోటిఫికేషన్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బి),రైల్వే ట్రైనింగ్ సెంటర్,ఆధునిక రైల్వే ఆసుపత్రి విశాఖలో వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ హక్కులు కాలరాస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరన్నారు.ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు.అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ అంశాలపై శనివారం జగదాంబ సెంటర్లో నిరసన ప్రదర్శన చేసినట్లు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ రైల్వే కార్మిక నేత కె.రామచంద్ర మూర్తి, బి.నీలకంఠం,ఆర్.తాతారావు,వి.శివ, జి.సుమతి,సొండి ప్రసాద్,సనరా,కె.దానయ్య,ఎం.మధు తదితరులు పాల్గొన్నారు…



