
ఆదేశాల అమలులో అలసత్వం వద్దు..కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి…
విజయనగరం :- ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను జిల్లాలో క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.‘అవేర్’ డేటా లేక్ వినియోగాన్ని పెంచుతూ, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా చేరవేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 58,289 సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తూ రాష్ట్రంలో నాలుగో స్థానం సాధించామని తెలిపారు.అలాగే డిజిటల్ సేవలపై 1,89,921 మందికి శిక్షణలు ఇచ్చి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచామని వెల్లడించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ పరిష్కారాల్లో ప్రజల సంతృప్తి స్థాయి 94 శాతం రేటుతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల భావన పెంచేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌లో జిల్లా గత కలెక్టర్ల సదస్సుతో పోలిస్తే 71 శాతం నుంచి 75.3 శాతానికి పెరిగి రాష్ట్రంలో ఏడో స్థానం సాధించిందని, వృద్ధిరేటులో రెండో స్థానంలో నిలిచిందని కలెక్టర్ వివరించారు.జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ భవనాల వివరాల సేకరణకు పంచాయతీరాజ్ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమిస్తున్నట్లు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయి పోటీల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించారు.
సంక్షేమ రంగంలో ఎంజేపీ పాఠశాలలకు భూముల గుర్తింపు,అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం,చిన్నారుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.ఉపాధి హామీ పథకం కింద జలధార,పశుగ్రాస అభివృద్ధి,పాఠశాలల ప్రహరీల నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
గృహ నిర్మాణాల్లో ఆగస్టు నాటికి 50 శాతం, డిసెంబర్ నాటికి 100 శాతం లక్ష్యాలు పూర్తి చేయాలని సూచించారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పీపీబీ పంపిణీని జూన్ నాటికి 90 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ తొలి దశను జూలై 31 నాటికి పూర్తి చేయాలని,పెండింగ్‌లో ఉన్న 22-ఏ(1) కేసులను జూలై 15లోపు పరిష్కరించాలని తెలిపారు. రీ-సర్వే ప్రక్రియను మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని,మైనింగ్ ఎన్‌ఓసీలను ఏడు రోజుల్లో క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు…



