
రాంబిల్లి :- అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో పారిశ్రామిక కాలుష్యం తీవ్ర రూపం దాల్చింది.శాన్విరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారుతుండగా,స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చట్టమెట్ట,పూడిమడక,సమీప గ్రామాల్లో ఉదయం, రాత్రి వేళల్లో దుర్వాసనలతో కూడిన పొగ వ్యాపిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుమ్ము కణాలు,రసాయన వాయువులు పంటలపై పడుతూ రైతులను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి.పచ్చని పంటలు బూడిద రంగు దాల్చుతున్నాయని,దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని రైతులు వాపోతున్నారు.మరోవైపు శ్వాసకోశ సమస్యలు,కళ్ల మంట వంటి ఇబ్బందులు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మౌనంగా ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాలుష్య నియంత్రణ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.పరిశ్రమలో కాలుష్య నియంత్రణ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా? నిరంతర పర్యవేక్షణ ఉందా? అనే సందేహాలు, వ్యక్తమవుతున్నాయి.స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యపై గట్టిగా స్పందించాలనే డిమాండ్ వినిపిస్తోంది.ఉపాధి కల్పన పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సమంజసం కాదని గ్రామస్తులు అంటున్నారు.తక్షణమే సమగ్ర తనిఖీలు చేపట్టి, కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని ప్రజలు హెచ్చరిస్తున్నారు…



