
సతకంపట్టు నుండి ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్న జాతర
ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం…
పాడేరు రూరల్ :- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు మోదమాంబ అమ్మవారి జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ నిషాంతి.టి తెలిపారు.మూడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా జరగనున్న ఈ జాతర ఆదివారం ఉదయం 6 గంటలకు సతకంపట్టు నుండి ప్రారంభమవుతుందని చెప్పారు.అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతర నిర్వహణకు అల్లూరి సీతారామరాజు జిల్లా యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. శాంతిభద్రతల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.డ్రోన్ నిఘా, సీసీటీవీ పర్యవేక్షణతో పాటు అన్ని ప్రవేశ మార్గాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్ స్టాప్‌లు, జూనియర్ కళాశాల మైదానం,ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రైవేట్ వాహనాలపై ప్రత్యేక పర్యవేక్షణతో పాటు అధిక ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.భక్తులకు త్రాగునీరు,ఆహార సదుపాయాలు,మొబైల్ మరుగుదొడ్లు,వైద్య శిబిరాలు,అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.పాడేరు పట్టణమంతటా నీటి సరఫరా,పారిశుధ్య నిర్వహణ,వీధి దీపాలు,ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఉత్సవాల్లో గిరిజన సంస్కృతి,సంప్రదాయాలు,ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా, అగ్నిమాపక ఏర్పాట్లు, అదనపు ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్,ఆలయ కమిటీ చైర్మన్ గిడ్డి ఈశ్వరి,జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ,ఐటిడిఏ పీవో ఆదిత్య వర్మ,జిల్లా అధికారులు,రెవెన్యూ సిబ్బంది,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు…



