
భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు,
రాజమహేంద్రవరం :- రాజమహేంద్రవరం అర్బన్,రూరల్ నియోజకవర్గాల పరిధిలో మంగళవారం హనుమాన్ జన్మోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ రామ నామం, హనుమంతుని దివ్య నామస్మరణలతో ప్రతిధ్వనించాయి. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణంతో భక్తి తన్మయత్వానికి లోనయ్యారు.హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అర్చనలు, అప్పాలను నైవేద్యంగా భక్తులు సమర్పించుకున్నారు.
గోషాడ గోసాయి మఠంలో…
నగరంలోని స్థానిక పుష్కరాల రేవులో ఉన్న గోషాడ గోసాయి మఠంలో హనుమాన్ జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా నిరాటకంగా జరుగుతున్న ఈ వేడుకల్లో సిద్ధాంతి బొండాడ దుర్గా రాజేంద్రప్రసాద్ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు, వాకచర్ల కృష్ణ, న్యాయవాదులు ఎస్ ధర్మారావు, ఏ శ్రీనివాస్, రంగారావు, ఏ రవి, బీ అనిల్ కుమార్, ఎం ప్రసాద్, శిష్య బృందం పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం 500 మామిడి పండ్లు ప్రసాద వితరణ చేశారు. పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఈవో కృష్ణ శ్రీదేవి సహాయ సహకారాలు అందించినట్లు బొండాడ దుర్గా రాజేంద్రప్రసాద్ తెలిపారు. గోశాడ గోసాయి మఠం 500 ఏళ్ల క్రితం స్థాపించారని గురువుతో పాటు శిష్యులు సమాధి కూడా ఇక్కడే ఉన్నాయని ఆయన తెలిపారు.
గోరక్షణ పేట వాటర్ ట్యాంకుల ప్రాంగణంలో…
స్థానిక గోరక్షణ పేట వాటర్ ట్యాంకుల ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమత్ జన్మోత్సవాన్ని ఆలయ అభివృద్ధి కమిటి గౌరవ అధ్యక్షుడు, అంబేడ్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి, నాగమణి దంపతుల ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. అర్చకులు కే శ్రీనివాస్, కేఎన్ ఆచారిల అర్చకత్వంలో అభిషేకం, అర్చన, తమలపాకుల సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ 1996లో రోడ్డు విస్తరణలో భాగం శ్రీ అభయ ఆంజనేయస్వామి విగ్రహాన్ని తొలిగించగా స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నామని తెలిపారు. అప్పటి నుంచి తన సొంత నిధులతో ఆలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఆలయాలు అంతగా లేనందున శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోనే వాస్తు దుర్గా మందిరం, శివాలయం నెలకొల్పాలని నిర్ణయించి, స్థానిక పెద్దలతో కలసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు)ని కలవగా స్థానికులతో కమిటీ ఏర్పాటు చేసుకుని ఆలయాలను నిర్మించుకోవాల్సిందిగా సూచించారని తెలిపారు. ఎమ్మెల్యే సూచనల మేరకు 36 మందితో కమిటీ ఏర్పాటు చేసుకుని, స్థానిక పెద్దల సహకారంతో మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆలయాల నిర్మాణం జరపడానికి మంచి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వాసుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఆలయాల నమూనాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయాల నిర్మాణ కమిటీ అధ్యక్షుడు బీ వీర్రాజు, కార్యదర్శి ఈతలపాటి రవికుమార్, కోశాధికారి ఓలేటి రామ్ ప్రసాద్, కమిటీ సభ్యులు కోసూరి హేమ, కోలమూరి వెంకటలక్ష్మి, ఉగ్గి ఉమాదేవీ, దంగేటి అన్నవరం, నాదెండ్ల ఉషారాణి, ప్రత్యూష, గంజి పద్మ, కే లక్ష్మి, భోగాది వెంకట లక్ష్మి, స్థానిక పెద్దలు బంగారు నాగేశ్వరరావు, సూరంపూడి శ్రీహరి, గంజి కృష్ణ, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. వాకర్స్, యోగ, లాఫింగ్ క్లబ్ లో అందిస్తున్న సేవలకు గాను క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు అలయం వద్దకు విచ్చేసి చెల్లబోయిన మూర్తిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు…

హుకుంపేట మూడు గుళ్లలో…
రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట నాగిరెడ్డి నగర్ మూడు గుళ్ళ ప్రాంగణంలో కొలువైయున్న అభయాంజనేయ స్వామికి విశేషార్చనలు నిర్వహించారు. మంగళవారం వేకువ ఝాము నుంచే భక్తులు ఆలయానికి విచ్చేసి పూజాదికాలు ప్రారంభించారు. ఆలయ పర్యవేక్షకులు ఎం రామమూర్తి శర్మ (రాంబాబు), బీ రమాబాయి భక్తులకు అన్ని సౌకర్యాలు సమకూర్చారు. అప్పాలను నైవేద్యంగా సమర్పించి భక్తులకు ప్రసాదంగా అందజేశారు…
పొట్టిలంక గ్రామంలో…
కడియం మండలం పొట్టిలంక గ్రామ హైవేలో వేంచేసియున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ 6వ వార్షికోత్సవం, హనుమాన్ జన్మోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పొట్టిలంక శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది. స్వామి వారి పుట్టిన రోజును పురస్కరించుకుని వేద పండితులు ఆంజనేయ మండపారాధన, హనుమాన్ హోమ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో సాధనాల బాబ్జీ దంపతులు, భీమిరెడ్డి నవీన్ దంపతులు, భీమిరెడ్డి దుర్గారావు దంపతులు, కొత్తపల్లి చంటి దంపతులు అత్యంత నిష్ఠతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన కామిరెడ్డి శ్రీనివాస్, దేవి దంపతులు స్వామి వారి పంచలోహ విగ్రహాన్ని కమిటీకి అందజేయడం విశేషమన్నారు. ఆలయం నిర్మించిన ఆరు సంవత్సరాలుగా గ్రామస్తుల సహకారంతో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ప్రతి మంగళవారం ఆలయం వద్ద భారీ అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.కడియం సీఐ అల్లు వెంకటేశ్వర్లు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు కొత్తపల్లి సత్యనారాయణ, గట్టి గంగాధర్, తోరాటి మల్లేశ్వర రావు, కామిరెడ్డి సత్తిపండు, కొత్తపల్లి గోవిందు, కామిరెడ్డి రాంబాబు, ఆలయ ధర్మకర్త భీమిరెడ్డి నాగేంద్ర, సర్పంచ్ కొత్తపల్లి వెంకటేశ్వరరావు, సాధనాల బాబ్జీ, ఆదిమూలం సాయిబాబా, ఇతర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, మహిళలు స్వామివారిని దర్శించుకున్నారు.



