
విజయనగరం :- విజయనగరం కేంద్రంగా మంగళవారం హనుమాన్ జయంతి,దళిత క్రైస్తవ మహాసభలు నిర్వహిస్తున్నందున జిల్లా ప్రజలందరూ సౌహార్దంతో,పరస్పర గౌరవంతో,మత సామరస్యంతో వ్యవహరించాలని ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ సూచించారు.సమాజంలో శాంతి, మత సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతీ పౌరుడి బాధ్యతని,మతపరమైన ద్వేషాన్ని ప్రోత్సహించే విధంగా లేదా అశాంతిని రేకెత్తించే విధంగా పోస్టులు పెట్టడం చట్ట ప్రకారం నేరమని పేర్కొన్నారు. గ్రూప్ అడ్మిన్‌లు తమ గ్రూపుల్లో షేర్ చేసే ప్రతీ మెసేజ్‌ను నిశితంగా పరిశీలించి,ఏవైనా ద్వేషపూరిత, అభ్యంతరకరమైన,రెచ్చగొట్టే విధంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఆ సందేశాలను తొలగించి, సంబంధిత వ్యక్తులను గ్రూప్ నుండి తొలగించాలని కోరారు. ఇటీవల కడప జిల్లాలో జరిగిన సంఘటన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వినియోగంపై జాగ్రత్తగా ఉండాలని,జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని,ధర్నాలు,ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పకుండా తీసుకోవాలని స్పష్టం చేశారు.హనుమాన్ జయంతి,దళిత క్రైస్తవ మహాసభల సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటానికి ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేసారు.పోలీసు అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు.సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ప్రజలకు హెచ్చరించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు…
మతాల మధ్య విద్వేషాలు సృష్టించే అసాంఘిక శక్తులు పంపే సందేశాలు,సోషల్ మీడియా వదంతులు,అసత్య ప్రచారాలను నమ్మవద్దని,అటువంటి వారిని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.ఇతర మతాల వారిని కించపరుస్తూ లేదా రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు,బ్యానర్ లు పెట్టడం,వ్యాఖ్యలు చేయడం,బలప్రదర్శన చేయడం నేరమని,అలాంటివారి పై కేసులు నమోదుచేసి,రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమాలలో పాత నేరస్తులు, రౌడీ షీట్ కలిగిన వ్యక్తులు పాల్గొనకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేశారు.ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలన్నారు.మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో అనుమతులు తీసుకొని పోలీసు వారి సూచనలను తప్పకుండా పాటించాలన్నారు.ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయిల్ 100/112 కు సమాచారం అందించాలన్నారు. మత పెద్దలు, స్థానికులతో శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు.ఎటువంటి తగాదాలు జరగకుండా శాంతి కమిటీలు,మత పెద్దలు బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా మసీదులు,దేవాలయాల వద్ద పటిష్ట ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలన్నారు.సున్నిత ప్రాంతాలను ముందుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.రాత్రి పహారా బలపరచి,విజిబుల్ పోలీసింగ్ చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టి,ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చెప్పట్టాలన్నారు.ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి,వారికి సహకారం అందించాలన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలన్నారు.జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని,ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు…



