‘అమ్మ’లా స్పందించిన అను…

వైద్య సహాయానికి మెడలో గొలుసు ఇచ్చి..
లక్షన్నర విలువజేసే బంగారు గొలుసు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న వైసీపీ నాయకురాలు,పలువురి అభినందనలు అందుకున్న అను యాదవ్…

రాజమహేంద్రవరం :- కష్టంలో ఉన్న వారిని చూసి సానుభూతి చూపించడం కాకుండా చేతనైన సహాయం చేస్తే మనసుకు అదో తృప్తి.మనిషిగా జీవితానికి అదో సార్థకత.రాజమహేంద్రవరం నగరానికి చెందిన వైసీపీ మహిళా నాయకురాలు అను యాదవ్ తన మానవత్వాన్ని చాటుకుని పదిమంది అభినందనలు.. అందుకున్నారు.ఆదివారం స్థానిక కృష్ణా నగర్ కొత్త రోడ్డులోని వీవీ గార్డెన్స్‌లో మార్గాని భరత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక 15వ డివిజన్ కు చెందిన సీహెచ్ దుర్గాదేవి తన తల్లిదండ్రులతో వచ్చి మాజీ ఎంపీ భరత్ కు తన ఆరోగ్య సమస్యలను వివరించింది. గత మూడు సంవత్సరాలుగా ఊపిరితిత్తుల వ్యాధితో దుర్గాదేవి బాధపడుతోంది.కొత్త ఊపిరితిత్తులు అమర్చడమే తప్ప మరొక వైద్యం లేదని,ఇందుకు రూ.50 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారని బాధితురాలు తల్లిదండ్రులు భరత్ కు తెలిపారు.ఆరోగ్యశ్రీ పథకంలో ఈ వైద్య సేవలు లేకపోవడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నామని వారు చెప్పారు.మాజీ ఎంపీ భరత్ సీహెచ్ దుర్గాదేవి ఆరోగ్య సమస్య ను వివరించి..ఆదుకోవాలని అక్కడున్న నాయకులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై అక్కడే ఉన్న అను యాదవ్ వెంటనే స్పందించి తన మెడలోని లక్షన్నర విలువ గల బంగారు గొలుసును బాధితురాలు సీహెచ్ దుర్గాదేవికి తన వంతు సహాయం ఇది అని ప్రకటించారు. మాతృ దినోత్సవం రోజున తనకు ఈ మంచి పని చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దుర్గాదేవి ఆరోగ్య సమస్య చెప్పగానే ఒక మాతృమూర్తిగా తన మనసు తల్లడిల్లిందని,ఏదో విధంగా ఆదుకోవాలని నిర్ణయించుకుని..వెంటనే తన మెడలో ఉన్న గొలుసునే దుర్గాదేవి చేతిలో పెట్టేశానని అన్నారు.అను యాదవ్ దాతృత్వానికి అక్కడున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు అభినందనలు తెలిపారు.కాకపోతే ఏ ఒక్కరూ తమ జేబులో నుండి కనీసం ఎంతో కొంత నగదు ఇచ్చి సహకరించాలనే ఆలోచన నాయకులకు రాకపోవడం శోచనీయమనే వ్యాఖ్యలు వినిపించాయి…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment