
ఏలూరు :- ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరులోని రెడ్ క్రాస్ కార్యాలయ ఆవరణలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు తలసేమియా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య( చంటి) పాల్గొని తొలుత రెడ్ క్రాస్ ఆవరణలో ఉన్న రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.తల సేమియా భవనంలో చికిత్స పొందుతున్న తల సేమియా చిన్నారులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ,రెడ్ క్రాస్ సంస్థ “మానవ సేవే మాధవ సేవ” అనే నినాదంతో కుల,మత,ప్రాంత భేదాలు లేకుండా నిరంతరం ప్రజలకు సేవలందిస్తోందని తెలిపారు.ప్రకృతి విపత్తులు,ప్రమాదాలు జరిగినప్పుడు ముందుండి సహాయక చర్యలు చేపట్టడం,రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడడం ఎంతో అభినందనీయమన్నారు.తలసేమియా అనేది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే వంశపారంపర్య జన్యు సంబంధిత రక్త వ్యాధి అని,ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ప్రతి నెలా రక్త మార్పిడి చేయించుకోవాల్సి వస్తుండడం బాధాకరమని అన్నారు.వివాహానికి ముందు తలసేమియా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఏలూరు జిల్లా శాఖ తలసేమియా చిన్నారులకు రక్తదానం, వైద్య సేవలు, ప్రత్యేక ప్రత్యేక లేబరేటరీ లేబరేటరీ సేవలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విశేష సేవలు అందిస్తోందని కొనియాడారు. చిన్నారులకు దాతల సహకారంతో ఉచిత చికిత్స అందిస్తున్న డా.ప్రసాద్ మరియు కమిటీ సభ్యులను అభినందించారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న రక్తదాతలు,దాతలు మరియు స్వచ్ఛంద సేవకులను ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
హిమోఫీలియా రోగుల క్యారియర్ (వాహక) తల్లులు మరియు సోదరీమణుల కోసం ఫ్యాక్టర్స్ అస్సే శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే చంటి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రజలకు సేవలందిస్తున్న రెడ్ క్రాస్ వాలంటీర్లును ఎమ్మెల్యే అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్,డాక్టర్ వి.శ్రీదేవి,హీమోఫీలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మహిళా విభాగం దక్షిణ ప్రాంత సమన్వయకర్త షేక్ మెహరున్నిసా,డాక్టర్ నిహారిక తలసేమియా,సికిల్ సెల్ ఎనీమియా మరియు హిమోఫిలియా వ్యాధులపై అవగాహన కల్పించారు…



