నీలు బంద్‌లో జ్వరంతో బాలుడి మృతి… ఆరుగురు చిన్నారులు అస్వస్థత…

రోలుగుంట :- అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలోని కొండ శిఖర గ్రామం నీలు బంద్‌లో జ్వరాలు కలవరపెడుతున్నాయి.గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న డిప్పల సురేష్ (2) అనే బాలుడు శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు.ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

మృతుడి తల్లిదండ్రులు డిప్పల కామేష్,శైలు జిమాడుగుల మండలం మొలగరువు గ్రామం నుండి వలస వచ్చి గత ఏడాది నుంచి నీలు బంద్‌లో జీవనం సాగిస్తున్నారు.చిన్నారి మృతి చెందడంతో కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇదే గ్రామానికి చెందిన మరో ఆరుగురు చిన్నారులు జ్వరంతో బాధపడుతున్నారు.వీరిలో డిప్పల సురి బాబు (3),గెమ్మిల నవీన్ (2),వంతల అఖిల్ (2),డిప్పల రమేష్ (8),కొర్ర ప్రవీణ్ (2),కొర్ర రుక్తి (5) ఉన్నారు.వెంటనే వైద్యసాయం అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.నీలు బంద్ గ్రామంలో మొత్తం 7 కుటుంబాలు PVTG కొందు గిరిజనులు నివసిస్తున్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం,ఆశా కార్యకర్తలు,అంగన్వాడి కేంద్రం లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చిన్న జ్వరం వచ్చినా 13 కిలోమీటర్లు నడిచి బుచ్చింపేట పిహెచ్‌సీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.గ్రామానికి రోడ్డు నిర్మాణానికి మంజూరైన నిధులతో వేసిన రోడ్డు భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో, గిరిజనులు శ్రమదానం చేసి తాత్కాలికంగా బాగు చేసుకున్నారు. అయినా అంబులెన్స్ రాకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో నీలు బంద్ గ్రామంలో తక్షణమే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని,మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అలాగే దోమతెరలు పంపిణీ చేయడం,మలాథియన్ స్ప్రేయింగ్ చేపట్టాలని కోరుతున్నారు.ఈ మేరకు గిరిజన సంఘం ఐదో షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా నాయకుడు కే.గోవిందరావు,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి చిరంజీవి,పీవీటీజీ సంఘం నాయకుడు గెమ్మిల వాసు ప్రభుత్వాన్ని కోరారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment