
వేసవిలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి…
జిల్లా ఎన్.సి.డి పిఓ డాక్టర్ జగన్ మోహన్.
కురుపాం :- వేసవి కాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రతలపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ అప్రమత్తం చేయాలని, దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి.జగన్ మోహన్ రావు సూచించారు.గుణానుపురం గ్రామాన్ని సోమవారం సందర్శించారు. ముందుగా అక్కడ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి,సంచార చికిత్సా శిబిరంలో ఆరోగ్య తనిఖీలు ,వైద్య పరీక్షల వివరాల రికార్డులు పరిశీలించారు.దీర్ఘకాలిక రోగులు వారికి ఇచ్చిన మందులు సక్రమంగా వేసుకునేలా పర్యవేక్షణ చేస్తూ ఆరోగ్య మెరుగు తీరుపై వైద్య పరీక్షలు జరిపి గమనించాలన్నారు. కేంద్రంలో ఓఆర్ఎస్, మందుల లభ్యత తనిఖీ చేశారు. అనంతరం వేసవి నేపధ్యంలో ‘వాతావరణ మార్పులు మానవుని ఆరోగ్యం (ఎన్.పి.సి.సి.హెచ్.హెచ్ )’ కార్యక్రమంలో బాగంగా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వేసవి నేపథ్యంలో వాతావరణంలో ఉష్ణగ్రతలు ఎక్కువగా ఉండటంతో శరీరం నీటిశాతo ఎక్కువగా కోల్పోతామని, దాహంతో నిమిత్తం లేకుండా నీరు, మజ్జిగ,నిమ్మరసం, ఓఆర్ఎస్ మొదలగు ద్రావణాలను తరచుగా తీసుకోవాలన్నారు. లేకపోతే డీహైడ్రేషన్, ఇంకా ఆలస్యం చేస్తే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడకు వెళ్లినా వెంట త్రాగునీరు ఉంచుకోవాలన్నారు. వేసవి సెలవులు కారణంగా పిల్లలు ఆరు బయట ఎండల్లో వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. వైద్య సిబ్బంది పిల్లలు, విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికపుడు పర్యవేక్షించాలన్నారు. అనంతరం అక్కడ వారికి వైద్య సిబ్బంది ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసి,వినియోగించే పద్ధతిని వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ బి.విజయనిర్మల, వైద్య సిబ్బంది వర్షిణి, సునీత , 104 సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



