
స్వర్ణభారత్ ట్రస్టులో అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి
బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులకు ముప్పవరపు ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు..
వెంకటాచలం :- భారతదేశ అస్తిత్వం వెనుక మన భాష, మన సంస్కృతి, మన కళారూపాలు ప్రధాన పాత్ర పోషించాయని, మన వారసత్వాన్ని ,ఆచార వ్యవహారాలను మన పెద్దలు కళల్లోనే నిక్షిప్తం చేశారని భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్ట్ నెల్లూరు చాప్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నమయ్య కీర్తనలను అద్భుతంగా ఆలపించిన శ్రీ గరిమెళ్ళ అనిల్ కుమార్‌ను అభినందించారు. అన్నమయ్య సంకీర్తనల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన దివంగత గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ స్మృతికి ఘన నివాళులు అర్పించారు. బాలకృష్ణ ప్రసాద్ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం మరణానంతరం వారికి ‘పద్మ’ అవార్డును అందజేసిందని గుర్తుచేస్తూ, వారి బాటలోనే వారి కుమారుడు సైతం అన్నమయ్య సంకీర్తనామృతాన్ని ప్రపంచానికి అందిస్తుండడం ఎంతో ఆనందదాయకమని అన్నారు.భారతదేశం కళల కాణాచి అని, మన దగ్గర కళలు అంటే కేవలం వినోదం మాత్రమే కాదని, అది విజ్ఞాన భాండాగారమని, అందుకే భారతీయ కళలన్నీ శాస్త్రాలుగా గౌరవాన్ని అందుకుంటున్నాయని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ చిన్నతనంలోనే అమ్మ పలుకుల్లో మాతృభాష, అమ్మ లాలి పాటల ద్వారా సంగీతం పరిచయమౌతుందని, అలాంటి సంగీతాన్ని జీవితంలో భాగం చేసుకోగలిగితే ఎన్నో మానసిక ఒత్తిళ్ళ నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా అన్నమయ్య సంకీర్తనలు యువతకు చేరే అవకాశం ఉందని, ఆ సంకీర్తనల్లోని మాధుర్యాన్ని, మహోన్నత భావాన్ని యువత మనసుల్లో నాటగలిగితే సమాజంలోని చాలా సమస్యలు దానంతట అవే పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మన కళలను కాపాడుకోవడం ద్వారానే మన భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవడం సాధ్యమౌతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మహోన్నత స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.అంతకుముందుస్వర్ణభారత్ ట్రస్ట్, వెంకటాచలం (నెల్లూరు చాప్టర్)లో ఉన్న బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులకు ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను చేశారు. ఇదే వేదిక నుంచి జైన్ సంఘం ద్వారా ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలతో పాటు ఇతర స్టేషనరీ సామగ్రిని అందించారు. ఈ దిశగా చొరవ తీసుకున్న స్వర్ణభారత్ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్, జైన్ సంఘం సభ్యులను వెంకయ్య నాయుడు అభినందించారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వర్ణభారత్ ట్రస్ట్, వెంకటాచలం (నెల్లూరు చాప్టర్)లో వెంకయ్య నాయుడు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాలలో స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపావెంకట్ తదితరులు పాల్గొన్నారు.



