జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి ..పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి…

రాజమహేంద్రవరం :- జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేసి పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బొమ్మూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పరిశ్రమల స్థాపన,ప్రోత్సాహం,పెట్టుబడుల ఆకర్షణ,లక్ష్యాల సాధన,స్వయం ఉపాధి పథకాల పురోగతి తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఆమోదం పొందిన దరఖాస్తులకు బ్యాంకుల ద్వారా రుణాలు త్వరితగతిన మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్న యువతకు అవసరమైన మార్గనిర్దేశం, సాంకేతిక సహాయం అందిస్తూ సింగిల్ విండో విధానం ద్వారా అనుమతుల ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలన్నారు.కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా గ్రామ, మండల స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాజానగరం మండలం కలువచర్ల పారిశ్రామిక పార్కులో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా సరసమైన ధరలకు భూకేటాయింపులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. స్థానిక యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో పర్యావరణ హిత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి గుడ్డ, జ్యూట్ సంచుల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా స్థానిక ఉత్పత్తి వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు. కడియం ప్రాంతంలో విస్తృతంగా కొనసాగుతున్న అగరబత్తి పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అందిస్తూ స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా స్థానిక ఉత్పత్తిదారులకు ప్రత్యేక ప్రదర్శన, విక్రయ అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జిల్లా పరిశ్రమల అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిత కాలపరిమితిలో సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవనిధర్ రామన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ డీవీ ప్రసాద్, సీపీఓ అప్పలకొండ, డీహెచ్‌ఓ ఎన్ మల్లికార్జునరావు, ఏపీఎంఐపీ పీడీ ఏ దుర్గేష్, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కన్సల్టెంట్ ప్రకాశ్,ఆర్‌టీహెచ్ బృందం ప్రతినిధులు, డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment