
కేంద్రంలోని డబుల్ ఇంజన్ సర్కారు పూర్తిగా ఆంధ్రకు నష్టం.
ఒడిషాతో సాఫ్ట్ కార్నర్ ఎందుకు?
ఎంపీ శ్రీ భరత్‌కు జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు సూటి ప్రశ్న..
ఏపీ హక్కుల విషయంలో డబుల్ ఇంజన్ సర్కారు ఎందుకు మౌనం జేఏసీ ధ్వజం..
కోటియా,వంశధార,పోలవరం,కేకే లైన్ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలి…
విశాఖ సిటీ :- ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు,ఉత్తరాంధ్ర ప్రయోజనాలు,గిరిజన ప్రాంతాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు ప్రశ్నించారు.శనివారం ఉదయం విశాఖ పార్లమెంటు సభ్యుడు శ్రీ భరత్ క్యాంప్ కార్యాలయంలో పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జేటీ రామారావు మాట్లాడుతూ, ఒడిషాతో ఉన్న కీలక సమస్యలపై పోరాడటంలో కేంద్రంలోని డబుల్ ఇంజన్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు.కోటియా గ్రామాల వివాదం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రామాల్లో ఒడిషా పరిపాలన విస్తరిస్తున్నా ఏపీ ప్రభుత్వం చేతులు ముడుచుకుని చూస్తోందని మండిపడ్డారు.వంశధార, నాగావళి నదీ జల వివాదాలు విషయంలో ఉత్తరాంధ్ర రైతుల సాగు ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడాల్సిన ప్రభుత్వాలు నదీజలాల అంశంలో బలహీన వైఖరి అవలంబిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం విషయంలో కూడా కేంద్రం స్పష్టమైన ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం బాధాకరం అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజలు పరిపాలనా గందరగోళం, అభివృద్ధి లోపం,హక్కుల అనిశ్చితితో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.విశాఖ కేంద్రంగా పూర్తి స్థాయి రైల్వే జోన్ ఏర్పాటు, కేకే లైన్ పరిపాలన,ఉద్యోగాలు, పెట్టుబడుల విషయంలో ఏపీ ప్రయోజనాలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయని విమర్శించారు.ఏపీ హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు.డబుల్ ఇంజన్ సర్కారు అంటే ఇదేనా? ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవం, భవిష్యత్తు ఎవరి బాధ్యత? ఏపీ ప్రభుత్వం ఎందుకు ఒడిషా ముందు సరెండర్ అవుతోందని జె.టి.రామారావు ప్రశ్నించారు. కేకే లైన్‌ను పూర్తిగా విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురావాలన్నారు.ఆంధ్రప్రదేశ్ హక్కులను తాకట్టు పెట్టే రాజకీయాలను ప్రజలు క్షమించరని, ఏపీ హక్కులు కాపాడాలి,ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని జేటీ రామారావు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బి.నీలకంఠం,ఆర్.తాతారావు,జి.సుమతి,గొలగాని రాము, వి.శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…



