
మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘం మాజీ చైర్మన్ గనగళ్ల వివేక్…
నర్సీపట్నం రూరల్ :- నర్సీపట్నంలోని సృష్టి క్షేత్రం వద్ద వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న మత్స్యకారుడు పడాల చినరమణపై మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్,ఆయన అనుచరులు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై మత్స్యకార సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఈ దాడిలో చినరమణ కాలర్ బోన్ ఫ్రాక్చర్ కాగా,ఆపరేషన్ అనంతరం శుక్రవారం కొత్త లక్ష్మీపురంలోని (కేఎల్ పురం) తన నివాసానికి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ చైర్మన్ గనగళ్ల వివేక్,ఇతర మత్స్యకార సంఘాల నాయకులు ఆయన ఇంటికి వెళ్లి బాధితుడిని,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ..విధి నిర్వహణలో ఉన్న సాటి మత్స్యకారుడిపై కర్రలతో పాశవికంగా దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌ను తక్షణమే అరెస్టు చేయాలని తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు.

అధికారం పోయినా ఆయనలో ఇంకా అహంకారం తగ్గలేదని,చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టడం దారుణమని మండిపడ్డారు.ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారని,న్యాయస్థానాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ దాడి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేయకూడదని కోరారు.ఆయన ఎక్కడ దాక్కున్నా సరే పోలీసులు వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.బాధితుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం,శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అండగా నిలవాలని,ఇంటర్మీడియట్ చదివిన చినరమణ కుమార్తెకు ఉన్నత విద్యావకాశాలు కల్పించి ఆదుకోవాలని వివేక్ విజ్ఞప్తి చేశారు.ఒకవేళ బాధితుడికి సరైన న్యాయం జరగని పక్షంలో,దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో నేషనల్ ఫిషర్మెన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసుపల్లి అప్పారావు,నర్సీపట్నం మత్స్యకార సంఘం అధ్యక్షులు గురవయ్య,సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు…



